కలం, వెబ్‌డెస్క్: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలో ఓ లెక్చరర్ చేసిన అవమానానికి ఇంటర్ విద్యార్థి సూసైడ్ (Student Suicide) చేసుకొని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లికి చెందిన నేతికొట్టు తెలుగు బుచ్చన్న, రేణమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. రెండో కుమారుడు తరుణ్ (17) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
తరుణ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలిచాడు. అయితే కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ ఫస్ట్ ఇయర్‌లో మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ తరుణ్‌ను హేళన చేసింది. దీంతో తరుణ్ ఇలా నిరుత్సాహపరచడం సరికాదని లెక్చరర్‌కు చెప్పాడు. దీంతో ఆగ్రహంతో సదరు లెక్చరర్ తరుణ్‌ను చెంపపై కొట్టింది. నువ్వు ఏమైనా మంత్రి కొడుకువా? నీకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లు బయట చాలా మంది ఉన్నారు.. అంటూ అందరి ముందు అవహేళన చేసింది. క్లాస్‌లో ఉన్న వాళ్లంతా పగలబడి నవ్వారు. దీంతో తరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తరుణ్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ అవమానించకూడదని తరుణ్ తన లేఖలో పేర్కొన్నాడు. ఒక్క సెన్సిటీవ్ పర్సన్‌కి అవమానం జరిగితే ఎంత బాధపడతాడో ఆమెకు తెలియాలి అని రాసుకొచ్చాడు. తన చావుకు కారణమైన లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని కోరాడు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే తరుణ్ ఇలా సూసైడ్ చేసుకొని మృతి చెందడంతో కాలేజీలో, గ్రామంలో విషాదం నెలకొంది. గొప్ప చదువులు చదివి, మంచి ఉద్యోగం చేసి తమను బాగా చూసుకుంటాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

