నత్తనడకన ‘సర్’.. మిగిలింది ఆరు రోజులే!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణ (Telangana SIR)కు మిగిలిన గడువు మరో ఆరు రోజులే. మళ్లోసారి గడువును పొడిగించబోమని.. ఇప్పటికే పదిరోజులు పెంచామని ఎన్నికల సంఘం చెప్తున్నది. కానీ, ప్రక్రియ మాత్రం చాలా స్లోగా సాగుతున్నది. ఆగస్టు 3తో గడువు ముగియనుండగా.. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ డిజిటైజేషన్ 75శాతమే అయింది.

ఓటర్ల జాబితాలో పేరు మిస్ అయితే సంక్షేమ పథకాలపై వేటు పడుతుందని, భవిష్యత్తులో స్కీమ్లు అందవని, రేషన్ కార్డు కంటిన్యూ కావడమూ అనుమానమేనన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఓటరు లిస్టు నుంచి పేరు పోకుండా చూసుకోవాలని రాజకీయ నాయకులు కూడా పదే పదే సూచిస్తున్నారు. అయితే.. గడువు దగ్గరపడుతున్నా తమ దగ్గరికి బూత్ లెవల్ ఆఫీసర్లు రావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎన్యూమరేషన్ ఫారాలూ కూడా ఇవ్వలేదన్న కంప్లయింట్స్ వస్తున్నాయి. హైదరాబాద్ వంటి చోట్ల బీఎల్వోలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.

కనిపించని బీఎల్వోలు!

ఇప్పటికే ‘సర్’ మొదలై 40 రోజులైంది. ఇక మిగిలింది ఆరు రోజులే. ఇప్పటివరకూ రాని బీఎల్వోలు ఇకపైన వస్తారనే నమ్మకాలు ఓటర్లలో కనిపించడం లేదు. దీంతో ఓటర్ల లిస్టులో పేరు ఉంటుందో.. ఉండదో.. అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఎవరి ఓటుకు వారే బాధ్యులు అంటూ పార్టీలు హెచ్చరిస్తున్నాయి. లిస్టులో పేరు లేకుంటే భవిష్యత్తులో పథకాలు అందవంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఇండ్లను విజిట్ చేయాల్సిన బీఎల్వోలు చాలా చోట్ల కనిపించడం లేదు. ఓటర్లే వారంతట వారు ఫోన్ చేసినా స్పందన ఉండటం లేదు. పట్టించుకోవాల్సిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

రోజుకు 1 శాతమే డిజిటైజేషన్!

ఓటర్ల జాబితా సంపూర్ణ ప్రక్షాళన పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల్లో భారీ స్థాయిలోనే ఓటర్లకు కత్తెర పడింది. ఇప్పుడు తెలంగాణలో సైతం దాదాపు 30 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు డిలీట్ అవుతాయనే అనుమానాలు ఉన్నాయి. ‘సర్’ మొదలై 40 రోజులు కావొస్తున్నా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 75% దగ్గరే ఆగిపోయింది. ఇక మిగిలింది ఆరు రోజులే (ఆగస్టు 3 వరకు). గత వారం రోజులుగా డిజిటైజేషన్ ప్రాసెస్ రోజుకు 1% కంటే తక్కువే జరుగుతున్నది. మిగిలిన ఆరు రోజుల్లో ప్రతీ రోజు యావరేజ్‌గా 4% చొప్పున పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నత్తనడకన జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై పది రోజుల క్రితమే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డిని మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. చాలా ఇండ్లను బీఎల్వూలు విజిట్ చేయలేదని ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు చెందిన బీఎల్వోలకు హైదరాబాద్ కాలనీలు కొత్త అని, అడ్రస్‌ను కనుక్కోవడంలో ఇబ్బంది పడుతున్నారనే సమాధానంతో సరిపెట్టారు. కానీ ఆల్టర్నేట్‌గా తీసుకోవాల్సిన చర్యలు, 100 శాతం డిజిటైజేషన్ చేపట్టడంపై వివరణ ఇవ్వలేకపోయారు.

హైదరాబాద్, మల్కాజిగిరిలో 60% లోపే

హైదరాబాద్, మల్కాజిగిరి జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 60% కూడా దాటలేదు. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 61% దాటింది. అన్ని జిల్లాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయినా డిజిటైజేషన్ ముందుకు సాగకపోవడానికి కారణం బీఎల్వోలు యాక్టివ్‌గా లేకపోవడం, ఇంటింటి విజిట్ చేసి ఓటర్ల వివరాలను వెరిఫై చేసుకోవడంలో నిర్లక్ష్యం అనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినా, బీఎల్వోల మొబైల్ నెంబర్లను ప్రకటించినా వృథాగా మిగిలిపోయాయి.

చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచే స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో రానున్న ఆరు రోజుల్లో ఏదో అద్భుతాలు జరుగుతాయనే ఆశల్లేవని ఓటర్లు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లకు సీరియస్ ఆదేశాలు ఇచ్చినా, జీహెచ్ఎంసీ నుంచి సహాయం తీసుకుంటున్నామని సీఈఓ చెప్తున్నా… ఈ రెండూ ప్రాక్టికల్‌గా ఫీల్డులో వర్కవుట్ కావడంలేదు. ముందస్తు సన్నాహాల్లో సీఈఓ ఆఫీస్ విఫలమైందని ప్రారంభంలోనే అసంతృప్తి వ్యక్తమైంది. ఉర్దూ, హిందీ భాషల్లో ఎన్యూమరేషన్ ఫారాలను ముద్రించకపోవడం, ఇంగ్లీషు/తెలుగులో ముద్రించినవి షవసరాలకు తగినంత సంఖ్యలో లేకపోవడం.. ఇవన్నీ సీఈఓ, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ గా బహిర్గతమయ్యాయి.

లక్ష్యానికి, వాస్తవానికి మధ్య అగాధం

రాష్ట్రవ్యాప్తంగానే ‘సర్’ ఆశించినంత వేగంగా, సంతృప్తికరంగా జరగడంలేదు. ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు ప్రకారం ఆగస్టు 3 నాటికి 100% డిజిటైజేషన్ పూర్తికావడం అనుమానంగా తయారైంది. లెక్కల కోసం తూతూ మంత్రంగా ముగిస్తున్నందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నాకొద్దీ వేగం పెరగడానికి బదులు మరింత స్లో అవుతున్నది. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ జరిగిన గణాంకాలను పరిశీలిస్తే లక్ష్యానికి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య భారీ అంతరం కనిపిస్తోంది.

అధికారిక గణాంకాల ప్రకారం జులై 19 నాటికి 2,19,23,435 ఫారాలు (64.81%) డిజిటైజ్ కాగా ఎనిమిది రోజుల తర్వాత (జూలై 27) ఈ సంఖ్య 2,54,13,878 (75.13%) కు చేరుకున్నది. జులై 28 నాటికి 2,56,36,498 ఫారాలు (75.79%) మాత్రమే పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి 27 మధ్యలో తొమ్మిది రోజుల్లో రోజుకు సగటున 1% చొప్పున మాత్రమే డిజిటైజేషన్ జరుగుతున్నది. జులై 27, 28 తేదీల మధ్య ప్రోగ్రెస్‌ను పరిశీలిస్తే అది 1% లోపే పూర్తయింది. దీంతో ఆగస్టు 3 నాటికి ఆరు రోజుల్లో రోజుకు 4% చొప్పున పూర్తికావడం అనుమానమేననే అభిప్రాయాలు బలపడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>