కలం, వెబ్‌డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) 2026లో భారత్‌కు మరో రెండు రజత పతకాలు దక్కాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఎక్స్ వేదికగా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో రజత పతకం గెలిచిన హర్జిందర్ కౌర్‌ను అభినందించారు. ఆమె క్రీడల పట్ల చూపిన అంకితభావం, అత్యుత్తమ ప్రతిభ ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే పురుషుల 10,000 మీటర్ల పరుగుపందెంలో రజత పతకం గెలిచిన నాయబ్ సుబేదార్ గుల్వీర్ సింగ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. గుల్వీర్ సింగ్ విజయం ఆయన అసాధారణ ప్రతిభ, కఠోర శ్రమ, అచంచల సంకల్పానికి నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన సాధన దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.

