కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో తెరిచి ఉన్న ఒక మ్యాన్‌హోల్ (Miyapur Manhole)లో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ప్రమాదానికి గురైన వ్యక్తిని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా అధికారులు గుర్తించారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు బాలయ్య ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఘటనా స్థలంలో హైడ్రా (HYDRAA), ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), జీహెచ్‌ఎంసీ (GHMC) అగ్నిమాపక సిబ్బందితో కూడిన ప్రత్యేక రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
వైశాలినగర్ అండర్‌పాస్ పరిసర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా నాలా మరమ్మతుల పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పనుల నిమిత్తమే సదరు మ్యాన్‌హోల్‌ను తెరిచి ఉంచారని, అయితే అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు గానీ, కనీస రక్షణ బ్యారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న బాలయ్య కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, మున్సిపల్ అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ నాలా మరమ్మతుల కారణంగానే గత కొన్ని రోజులుగా వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయినప్పటికీ, నగరంలో వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు నాలా కింది భాగాల్లో బాలయ్య కోసం అన్వేషణను వేగవంతం చేశాయి.

