కలం, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వ్యాపారులు మరో సరికొత్త దందాకు తెరలేపారు. దేవుడి పేరుతో రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం మొదలు పెట్టేశారు. ఫ్లాట్లు కొంటే జీవితాంతం తిరుమల ఉచిత దర్శనం కల్పిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఎస్‌సీపీ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఈ సరికొత్త ప్రచారానికి తెరలేపింది. తమ ఫ్లాట్ల విక్రయాల కోసం దేవుడిని అడ్డుపెట్టుకుంది.
అయితే భక్తులు, సాధారణ ప్రజలు, నెటిజన్ల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం టీటీడీ దృష్టికి వెళ్లింది. వెంటనే అధికారులు స్పందించి సదరు సంస్థపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రకటనలు చేయొద్దని, వ్యాపారం కోసం దేవుడిని అడ్డుపెట్టుకోవద్దని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

