పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు.. కేంద్ర మంత్రికి KTR విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని పెండింగ్ ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw)ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. కాజీపేటను కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ తో ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం.. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు, మనోహరాబాద్–సిరిసిల్ల–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు వేగవంతం, టైర్-2 ఐటీ నగరాలకు కేంద్ర సహకారం కోరుతూ అశ్విని వైష్ణవ్ కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వే పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే సరైన సమయమని.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సూచించారు.

కొత్త డివిజన్ ఏర్పాటు చేయండి..

కాజీపేట డివిజన్‌లో కాజీపేట–బల్లార్షా, పెద్దపల్లి–నిజామాబాద్, కాజీపేట–ఎర్రుపాలెం, డోర్నకల్–మణుగూరు, మోతమర్రి–విష్ణుపురం, కాజీపేట–వంగపల్లి రైల్వే సెక్షన్లను చేర్చాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. రైల్వే ఉద్యోగులు కూడా కాజీపేట డివిజన్ ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని అన్నారు. కేవలం 900 కిలోమీటర్లతో గుంటూరు డివిజన్, సుమారు 2,200 కిలోమీటర్లతో విజయవాడ, గుంతకల్ డివిజన్లు కొనసాగుతున్న నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ (Kazipet Railway Division) ఏర్పాటు చేయడం ప్రయోజనకరమని అన్నారు.

కేసీఆర్ హయాంలో శంకుస్థాపన..

మనోహరాబాద్-సిద్దిపేట-సిరిసిల్ల-వేములవాడ-కొత్తపల్లి రైల్వే లైన్‌ను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గానికి అత్యంత కీలకమైన 151 కిలోమీటర్ల ఈ న్యూ బ్రాడ్ గేజ్ రైల్వే ప్రాజెక్టును అత్యవసరంగా పూర్తి చేసేలా పనులు ప్రారంభించాలన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కిందని చెప్పుకొచ్చారు.

వేములవాడకు ఈ రైల్వే లైన్ అత్యంత కీలకం..

సిరిసిల్ల టెక్స్‌టైల్ పరిశ్రమకు, దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఈ రైల్వే లైన్ అత్యంత కీలకమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఈ రైల్వే లైన్ పూర్తయితే తెలంగాణకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ రైల్వే స్టేషన్లను ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో చేర్చి ఆధునికీకరించాలని కోరినట్లు తెలిపారు. మిడ్ మానేరు రిజర్వాయర్‌పై రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జికి ఆమోదం తెలపాలని, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ మొత్తాన్ని విద్యుదీకరించాలని విన్నవించినట్లు చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>