కలం, వనపర్తి: వనపర్తి జిల్లా ఖిల్లా ఘన్పూర్ మండలంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరిసాల సాయినాథ్ ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు గదుల్లో ఉండలేక డైనింగ్ హాల్లోనే నిద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో ఏ ప్రమాదం జరుగుతుందోననే విద్యార్థులు భయపడుతున్నారని వివరించారు. హాస్టల్ సమస్యలపై పలుమార్లు కలెక్టర్, అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తాం..
స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి విద్యార్థులకు నూతన హాస్టల్ భవనాన్ని మంజూరు చేయాలని సిరిసాల సాయినాథ్ డిమాండ్ చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని వెంటనే కూల్చివేసి ఆధునిక సౌకర్యాలతో కొత్త హాస్టల్ భవనం నిర్మించాలన్నారు. లేకపోతే విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
బీజేపీ మండల అధ్యక్షుడు బుచ్చిబాబు గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొరిగేల గోపి, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాంచందర్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, షాపూర్ మాజీ సర్పంచి బాలాంజనేయులు గౌడ్, నాయకులు వెంకటేష్, రాజు, ఈదమ్ము ఆంజనేయులు, బండారి రాజు, సత్యం, గోపాల్ రెడ్డి, అనిల్ సాక, నర్సింహులు పాల్గొన్నారు.

