కలం, వనపర్తి: పోలీసులకు క్రమశిక్షణతో పాటు వారు వినియోగించే ప్రభుత్వ వాహనాల నిర్వహణ కూడా సరిగ్గా ఉండాలని వనపర్తి (Wanaparthy) జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే పోలీసు వాహనాలు ఎల్లప్పుడూ కండీషన్లో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం ఆధ్వర్యంలో అన్ని స్టేషన్ల పెట్రో కార్లు, బ్లూ కోల్ట్స్ వాహనాలతో పాటు స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ అధికారుల బైకులను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు.
సొంత వాహనం కంటే..
వాహనాల శుభ్రత, ఇంజిన్, ఇతర విభాగాల పని తీరు, సైరన్లు, పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులను ఎస్పీ సునీత రెడ్డి పరిశీలించారు. అనంతరం కొత్త టైర్లు, బ్యాటరీలను పంపిణీ చేశారు. ప్రతి డ్రైవర్ అప్పగించిన వాహనాన్ని బాధ్యతతో సంరక్షించాలని సూచించారు. సకాలంలో సర్వీసింగ్, పరిశుభ్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తప్పనిసరన్నారు.
వాహనాలను అత్యుత్తమంగా నడిపే డ్రైవర్లను ప్రోత్సహిస్తామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీత రెడ్డి హెచ్చరించారు. ఏఆర్ అదనపు డీఎస్పీ వీరారెడ్డి, ఎంటీవో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్సైలు మంజునాథ్ రెడ్డి, నరేష్, పరమేశ్వర్ రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

