లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గోశాలలో కోడె విక్రయ వివాదం.. అధికారుల విచారణ

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్ మండలం కాల్వ గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ గోశాలలో గోవుల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. భక్తులు మొక్కులు తీర్చుకుని స్వామివారికి సమర్పించిన కోడెలు, ఆవులు సరైన మేత, సంరక్షణ లేక బక్కచిక్కిపోతుండగా గోశాలకు చెందిన ఓ కోడెను అధికారుల అనుమతి లేకుండానే విక్రయించారనే ఆరోపణలు ఆలయ వ్యవహారాలను వివాదంలోకి నెట్టాయి.

స్వామివారికి మొక్కులు తీర్చుకున్న భక్తులు కోడెలను సమర్పించడం సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ. ప్రస్తుతం గోశాలలో సుమారు 50 వరకు కోడెలు, ఆవులు ఉన్నట్లు సమాచారం. వీటి సంరక్షణ కోసం దేవాదాయ శాఖ ఇద్దరు సిబ్బందిని నియమించినప్పటికీ, సరైన మేత అందక గోవులు క్షీణిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన వీడీసీ వార్షిక సమావేశంలో గోశాలకు చెందిన ఓ కోడెను వీడీసీ చైర్మన్ దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా బయట వ్యక్తికి విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

దీనిపై సమావేశంలో ప్రశ్నించగా సంబంధిత వ్యక్తి సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. విషయం దేవాదాయ శాఖ దృష్టికి చేరడంతో ఆలయ ఇంచార్జి ఈవో భూమయ్య మంగళవారం ఆలయాన్ని సందర్శించి గోశాల పరిస్థితిని పరిశీలించారు. కోడె విక్రయానికి సంబంధించిన అంశంపై ప్రాథమిక విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులు సమర్పించిన గోవులు, కోడెలు ఆలయ ఆస్తిగా పరిగణించబడతాయని, దేవాదాయ శాఖ అనుమతి లేకుండా వాటిని విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>