కలం, కోరుట్ల: జగిత్యాల(Jagtial) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు ప్రత్యక్షంగా నిరూపించేలా జగిత్యాల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మహమ్మద్ ముక్రమ్ (Dr Mukram) తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. రక్తహీనతతో పాటు ముందస్తు ప్రసవ నొప్పులతో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్న తన సతీమణి డాక్టర్ సోఫియా ముక్రమ్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించకుండా, తాను విధులు నిర్వహిస్తున్న జగిత్యాల ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలోనే చేర్పించారు. అక్కడ వైద్యుల బృందం అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి తల్లి, మగ శిశువును సురక్షితంగా కాపాడారు. ప్రస్తుతం ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ ముక్రమ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి ప్రభుత్వ వైద్య సేవలపై విశ్వాసం పెంపొందించడమే తన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవని, ఆధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో గైనకాలజిస్టు డాక్టర్ శైలజ, సీనియర్ రెసిడెంట్, ఐసీయూ ఇన్‌చార్జ్ డాక్టర్ తిరుమల, శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సాయి, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ మహేష్‌తో పాటు ఆర్‌ఎంఓ డాక్టర్ నరేష్, డాక్టర్ స్వరూప కీలక పాత్ర పోషించారు. తమ సహకారానికి వారందరికీ డాక్టర్ ముక్రమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన మిల్లత్ ముస్లిం వెల్ఫేర్ సంఘం కోరుట్ల అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ పాషా మాట్లాడుతూ, డాక్టర్ మహమ్మద్ ముక్రమ్ తీసుకున్న నిర్ణయం ప్రతి వైద్యుడికి, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలలో విశ్వాసాన్ని పెంచేందుకు ఆయన చేసిన కృషిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మహమ్మద్ ముక్రమ్, డాక్టర్ సోఫియా ముక్రమ్ దంపతులకు “ఆదర్శ సేవా పురస్కారం” ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్టను మరింత పెంచే ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలలో మరింత విశ్వాసం పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

