కలం, తెలంగాణ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో జెన్ జీ చర్చలు మొదలయ్యాయి. తాజాగా జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో జెన్ జీ జపం అనివార్యంగా మారుతున్నది. మొత్తం ఓటర్లలో జెన్ జీ కేటగిరీ తక్కువే అయినా అది చూపే ప్రభావం మాత్రం గణనీయంగా ఉంటుందని, ఫలితాలను తారుమారు చేయగలుగుతుందనే భావన పార్టీల్లో బలపడుతున్నది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ (Telangana Congress), బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆ కోణంలోనే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.
అందులో భాగమే సీఎం రేవంత్‌రెడ్డి తాజా ప్రతిపాదన! దానికి ముందు బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు కూడా అలాంటి ప్రయత్నాల్లో భాగమే! జెన్ జీ జపం చేయకపోతే చిక్కులు తప్పవని పార్టీల నేతలు భావిస్తున్నారా?.. ముందుగానే మేలుకున్న కాంగ్రెస్ నెల రోజుల ముందే జెన్ జీ ఓటర్లపై సర్వే చేయించిందా?.. ఆ సెక్షన్‌ను ఆకట్టుకోవడానికి కార్యాచరణ కూడా సిద్ధం చేసిందా?.. తెలంగాణ మోడల్‌నే దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారా?… ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ‘ఔను’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
‘కాక్రోచ్’ ఆలోచనలతో పార్టీలు అలర్ట్
కాక్రోచ్ జనతా పార్టీ నిరసన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆలోచనలో పడేసింది. జెన్ జీ మద్దతు లేకుంటే మనుగడ కష్టమేనని రాజకీయ పార్టీలు దాదాపు ఒక అంచనాకు వచ్చాయి. తాజాగా జంతర్ మంతర్ ఆందోళనను ఆ పార్టీల నేతలు ప్రస్తావిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని మోదీయే ఇన్‌స్టాగ్రామ్ ప్రస్తావన తీసుకొచ్చి మంత్రులంతా ఇకపైన ఆ సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలని.. జెన్ జీ యూత్‌కు దగ్గరయ్యేలా షార్ట్స్, రీల్స్, మీమ్స్ తదితర రూపాల్లో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సైతం 18-35 ఏజ్ గ్రూప్ యువతపై ఫోకస్ పెట్టింది. సీక్రెట్‌గా నిర్వహించిన సర్వేలో ఆ సెక్షన్ ఓటర్ల అభిప్రాయాలను పసిగట్టింది. దానికి తగిన కార్యాచరణ చేపట్టాలని భావిస్తున్నది. మరోవైపు బీఆర్ఎస్ సైతం యూత్ ఆకాంక్షలుగా ఉన్న జాబ్స్, నోటిఫికేషన్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలను టేకప్ చేస్తున్నది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా ధర్నాచౌక్ దగ్గర బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున జరిగిన ప్రోగ్రామ్‌కు కేటీఆర్ హాజరయ్యారు.
సునీల్ రిపోర్టులో కీలక అంశాలు
- కాంగ్రెస్ తరఫున సునీల్ కనుగోలు ఇటీవల నాయకత్వానికి ఇచ్చిన రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను డిసైడ్ చేసేది జెన్ జీ ఓటర్లేననే అభిప్రాయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ ఓటర్లను ఆకట్టుకోవడంపైనే ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం.
- ఇందుకు కొన్ని ఉదాహరణలను కూడా సునీల్ కనుగోలు ప్రస్తావించినట్లు తెలిసింది. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాంటి పొరుగు దేశాల్లో అధికార పార్టీలను మట్టి కరిపించి కొత్త పార్టీలకు అధికారం అప్పగించడంలో జెన్ జీ చేపట్టిన ఆందోళనలు, ఇండియాలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం.
- సునీల్ కనుగోలు రిపోర్టుకు తగినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల.. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉన్న వయో పరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని, ఇది జెన్ జీ ఓటర్లకు దగ్గరయ్యే వ్యూహంలో భాగమేననే అభిప్రాయమూ కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.
- ఎన్నికల్లో పోటీ చేసే వయో పరిమితిని తగ్గించడం అనేది కేంద్ర ప్రభుత్వ చొరవ, రాజ్యాంగ సవరణతో ముడిపడిన అంశమే అయినా జెన్ జీ ఓటర్లను సీఎం ప్రతిపాదన ఆకట్టుకోగలిగిందనేది కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నది.
‘ఛాత్రోం కీ గూంజ్’ వెనుక..!
జెన్ జీ ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ముందుగానే ఆలోచించారని, అందులో భాగమే ‘ఛాత్రోం కీ గూంజ్’ అనే కార్యక్రమానికి రాజస్థాన్‌లోని కోట నుంచి శ్రీకారం చుట్టడం అని పీసీసీ వర్గాలు అంటున్నాయి. నీట్ పేపర్ లీక్‌తో విద్యార్థుల్లో నెలకొన్న మానసిక ఆందోళనను గమనించి వారి సమస్యలపై పోరాడాలని, వారికి అండగా నిలవాలని రాహుల్ భావించారని చెప్తున్నాయి.
ఇదే క్రమంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్ఎస్‌యూఐ ద్వారా విద్యార్థులను సమావేశపరిచి వారి అంశాలపై నేతలు మాట్లాడారు. ఎన్ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాకర్ హైదరాబాద్‌కు వచ్చి జేఎన్టీయూ విద్యార్థులతో సమావేశమయ్యారు. ప్రతి జిల్లాలో, నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థి సంఘాలతో సంబంధం లేకుండా తటస్థంగా ఉండే విద్యార్థులనూ సమీకరించడంలో భాగమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించాలన్నది ఎన్‌ఎస్‌యూఐ ఆలోచన. యూత్ కాంగ్రెస్‌కు సంబంధం లేని యువతను కూడా భాగస్వామ్యం చేస్తే ఎన్నికల నాటికి యూత్ ఓటు బ్యాంకు అనుకూలంగా ఉంటుందనేది కాంగ్రెస్ నేతల అంచనా.
రేవంత్ ప్రతిపాదన దేశవ్యాప్తంగా..!
- ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీస వయోపరిమితి 25 సంవత్సరాలుగా ఉన్నదని, దీన్ని 21 సంవత్సరాలకు కుదించే విధంగా చట్ట సవరణ చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదన. రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసే వయసును 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు తగ్గించాలన్నది కూడా మరో ప్రతిపాదన.
- ఈ రెండూ కార్యరూపం దాల్చేలా, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సాకారం అయ్యేలా ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి ఉభయ సభల్లో తీర్మానాన్ని ఆమోదింపజేస్తామని ఇటీవల సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
- ఈ ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలలో అమలు చేసేలా పకడ్బందీగా సమన్వయాన్ని నెలకొల్పాలని రాహుల్‌గాంధీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో అమలు చేసే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరిగేలా ఒక కో ఆర్డినేషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాహుల్ భావించినట్లు సమాచారం.
- దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్ వేదికను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇక పార్టీ స్పోక్స్ పర్సన్స్ గా ఇంతకాలం అమలైన విధానానికి బదులు కౌన్సెలింగ్ సిస్టమ్ పెట్టి ఎంపిక చేసే విధానానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది.

