కలం, నిర్మల్ : సోన్ మండలం (Soan Mandal) కడ్తాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం జలసిరి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కట్కం రామకృష్ణ మాట్లాడుతూ.. భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్ ల నిర్మాణాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రతి రైతు తమ వ్యవసాయ క్షేత్రంలో తప్పనిసరిగా ఫామ్ పాండ్ లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఫామ్ పాండ్ ల ద్వారా నీటిని నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చని వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుర్రం రాము, ఎంపీఓ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సుమాయ తస్కిన్ తదితరులు పాల్గొన్నారు.

