కలం, వెబ్ డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సింగరేణి సంస్థను నష్టాల ఊబిలోకి నెట్టేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాలను కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. కేసీఆర్ సింగరేణిని రాజకీయ అవసరాలకు వాడుకుని తీవ్రంగా నష్టపరిచారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల కారణంగానే సింగరేణి ఆదాయం తగ్గుతుందన్నారు. సింగరేణికి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలను చెల్లించకుండా, ఇతర రాష్ట్రాల్లో బ్లాకుల వేలంలో పాల్గొనకుండా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు.
తెలంగాణ జెన్ కో టెండర్లలో పాల్గొనడం ద్వారా సింగరేణికి పోటీ సృష్టిస్తున్నారని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంస్థకు రావాల్సిన రూ. 54 కోట్ల మేర బకాయిలు పెండింగ్లో పెట్టిందని ఆయన ఎత్తిచూపారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి సింగరేణి రక్షణకు బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు.

