కలం, వెబ్ డెస్క్: రంపచోడవరంలో తాను ఇటీవలే కలిసిన విద్యార్థిని మరణించడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ‘పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని ఆత్మహత్యకు పాల్పడటం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది.ఇటీవలే కలిసినప్పుడు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి నాతో శివాని చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ దూరం కావడం బాధాకరం. ఆమె మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను’ అని తెలిపారు.
ధైర్యంగా నిలబడాలి..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులు, యువతకు కీలక సూచనలు చేశారు. సమస్యలు, కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఒత్తిడి, నిరాశకు లోను కావొద్దని.. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందన్నారు. ఎలాంటి బాధ ఉన్నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆత్మీయులతో పంచుకుని అధిగమించాలన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

