కలం, వెబ్డెస్క్: సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కూడా గడవకముందే వాయిదా పడుతోంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభలో నేడు కీలక యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చ ప్రారంభించాలని స్పీకర్ సూచించారు. ఇదే సమయంలో విపక్ష ఎంపీలు ఢిల్లీ లాఠీ చార్జ్ పై, నీట్ పేపర్ లీక్పై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు విపక్ష ఎంపీలు సహకరించాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు రిక్వెస్ట్ చేశారు. యువత ఈ బిల్లుపై చర్చ జరగాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సభ ప్రారంభం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో లోక్ సభ నేడు సాయంత్రం 5 గంటలకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను 3 గంటలకు వాయిదా వేశారు.

