కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశముండటంతో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, సంస్థలు ఉద్యోగులను ముందుగానే కార్యాలయాల నుంచి పంపించాలని సూచించారు.
ఉద్యోగుల భద్రత, రహదారులపై ఒత్తిడి తగ్గించడం, ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ సూచనలు జారీ చేసినట్లు ట్రాఫిక్-1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సంస్థలు తమ కార్యాలయాల స్థానం, ముందస్తు లాగౌట్ సమయాలను trfrcord@scsc.in ఈమెయిల్‌కు తెలియజేయాలని కోరారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు సంస్థలు సహకరించాలన్నారు. ప్రజలు కూడా అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికారులు కోరారు.

