కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు (Central Rural Local Body Funds) నిలిచిపోయాయి. జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం ఫండ్స్ ఆగిపోయాయి. నిబంధనల ప్రకారం ఎన్నికైన బాడీలు ఉంటేనే ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు నేరుగా నిధులు వస్తాయి. అయితే రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌ల గడువు 2024 జూన్‌తోనే ముగియడంతో 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించి వాటికి రావాల్సిన రూ. 448.65 కోట్లు నిలిచిపోయాయి.
దీనికి తోడు ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలకూ రావాల్సిన నిధులు ఆగిపోయాయి. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధుల్లో మొత్తంగా రూ.1,090.55 కోట్లు విడుదల కాకుండా పోయాయి. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘం ఉనికిలోకి రావడంతో గత ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులు క్యారీ ఫార్వర్డ్ కావడం లేదు. దీంతో జిల్లా, మండల పరిషత్‌లతో పాటు ఎన్నికలు జరగని గ్రామ పంచాయతీలకూ నిధులు అందలేదు.
ఎన్నికల తర్వాత పాత బకాయిలు రిలీజ్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు 2024 ఫిబ్రవరిలోనే ముగియగా, 2025 డిసెంబర్ వరకు ఎన్నికలు జరగలేదు. దీంతో 2024-25, 2025-26 సంవత్సరాల్లో పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు అందలేదు. అయితే గతేడాది డిసెంబర్‌లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే పాత బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. అలాగే ఢిల్లీకి వెళ్లి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమయ్యారు.
ఆ తర్వాత నిధులు విడుదలయ్యాయి. 15వ ఫైనాన్స్ కమిషన్ గడువులోగా సిఫారసుల మేరకు అందాల్సిన నిధులన్నీ వచ్చినా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 16వ ఫైనాన్స్ కమిషన్ గడువు మొదలైంది. దీంతో పాత కమిషన్ బకాయిలు కొత్త కమిషన్ ఉనికిలోకి రావడంతో క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ లేకపోవడంతో మురిగిపోయినట్లయింది. నష్టపోయిన నిధులను తిరిగి తెప్పించుకునేందుకు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిబంధనలు, లీగల్ చిక్కుల్లేనంత వరకు నిధులొస్తాయనే ధీమా వ్యక్తమవుతున్నది.
యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఫండ్స్
– కేంద్ర ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం రాష్ట్రం నుంచి నిధుల విడుదలకు ప్రతిపాదనలు వచ్చే సమయానికి ఆయా గ్రామీణ స్థానిక సంస్థలకు అప్పటికే విడుదలైన నిధులన్నీ పూర్తిగా వినియోగమై ఉండాలి.
– గత ఆర్థిక సంవత్సరంలో రిలీజైన నిధులను ఖర్చు చేసినట్లు యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించాలి.
– రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో అప్పటివరకు రెడీ అయిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించడంతో పాత బకాయిలు అందాయి.
– అందిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టి యుటిలైజేషన్ సర్టిపికెట్లు సమర్పించనందున మరికొన్ని పంచాయతీలకు రావాల్సిన నిధులు రాలేదు.
– జిల్లా, మండల పరిషత్‌లు ఉనికిలోనే లేకపోవడంతో వాటికి రావాల్సిన రూ. 448.65 కోట్లు కూడా విడుదల కావడం అనుమానమే.
రావాల్సిన నిధుల వివరాలు (రూ.కోట్లలో)
జిల్లా పరిషత్
సంవత్సరం కేటాయింపు విడుదల బకాయి
2024-25 75.70 0 75.70
2025-26 73.85 0 73.85
మొత్తం 149.55 0 149.55
మండల పరిషత్
సంవత్సరం కేటాయింపు విడుదల బకాయి
2024-25 151.40 0 151.40
2025-26 147.70 0 147.70
మొత్తం 299.10 0 299.10
గ్రామ పంచాయతీ
సంవత్సరం కేటాయింపు విడుదల బకాయి
2024-25 1,286.90 1,280.60 6.30
2025-26 1255.45 619.85 635.60
మొత్తం 2,542.35 1,900.45 641.90

