కలం, వెబ్‌డెస్క్: ఆహార కల్తీపై రోజురోజుకూ ప్రజల్లో భయాలు పెరిగిపోతున్నాయి. బయట ఏం కొనాలన్నా, తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా (Noida) లో మరో భారీ కల్తీ ఫుడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అపరిశుభ్ర వాతావరణంలో సోయా చాప్ (Soya Chaap) తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోయా చాప్ తయారు చేసే మిశ్రమంలో ఏకంగా ఓ వ్యక్తి స్నానమే చేస్తున్నాడు.
నోయిడాలోని సెక్టార్ 27లోని ఒక ఫుడ్ యూనిట్లో ఈ సోయా చాప్ తయారీ వీడియో బయటకు వచ్చింది. సోయా చాప్ పిండితో నింపిన పెద్ద డ్రమ్ము లాంటి తొట్టెలో ఒక వ్యక్తి షర్ట్ లేకుండా దొర్లుతున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇక జీవితంలో సోయా చాప్ తినను అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా, అపరిశుభ్రంగా ఆహారం తయారు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో యూపీలోదేనా? లేక ఢిల్లీకి చెందిన వీడియోను యూపీ అంటూ ప్రచారం చేస్తున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

