కలం, వెబ్‌డెస్క్: ప్రశ్నాపత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షల విధానాల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ నందన్ నీలేకని నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన ఐదుగురు నిపుణులను సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా పరీక్షా నిర్వహణ విధానాల్లో కేంద్రం మార్పులు చేయనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘ఫ్రెండ్స్.. స్టూడెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడినవాళ్లు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మేం ఇప్పటికే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకురాబోతున్నాం. దీనికి సంబంధించిన బిల్లును రేపే (సోమవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నాం. మన ఎగ్జామినేషన్ సిస్టమ్ విశ్వసనీయమైనదిగా, పారదర్శకంగా ఉండాలి. ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో టెక్నాలజీని అధికంగా వినియోగించాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నందన్ నీలేకని నేతృత్వంలోని ఈ కమిటీ పరీక్షల విధానాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై దృష్టి పెడుతుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సంస్కరణలు తీసుకొస్తాం” అని ప్రధాని మోదీ ప్రకటించారు.
ఎవరెవరు ఉన్నారు?
1. నందన్ నీలేకని, ఇన్ఫోసిస్ కో–ఫౌండర్
2. ఎస్.సోమనాథ్, ఇస్రో మాజీ చైర్మన్
3. తపన్ డేకా, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్
4. వి.కామకోటి, ఐఐటీ చెన్నై డైరెక్టర్
5. అనితా కర్వాల్, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి
6. అమృత్ లాల్ మీనా, లాజిస్టిక్స్ ఎక్స్‌పర్ట్
ఏం చేస్తుంది?
జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణకు సంబంధించి అమలు చేయాల్సిన సంస్కరణలను టాస్క్‌ఫోర్స్ సిఫార్సు చేస్తుంది. భవిష్యత్తులో జరిగే ఎగ్జామ్స్‌ను విశ్వసనీయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. పేపర్ లీక్‌లు, మాల్‌ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు రక్షణ వ్యవస్థలను సూచిస్తుంది. పరీక్షల నిర్వహణలో టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకొని సెక్యూరిటీని బలోపేతం చేయడంపై సిఫార్సులు చేస్తుంది.
ఆధార్‌కు ఆద్యుడు
మన దేశంలో యూపీఏ సర్కార్ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆధార్‌కు ఆద్యుడు నందన్ నీలేకని. ఇప్పుడీ గుర్తింపు కార్డే అన్నింటికీ ఆధారంగా మారింది. 2009లో ఇన్ఫోసిస్ నుంచి బయటకొచ్చిన నీలేకని.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆధార్ ప్రోగ్రామ్‌ను సక్సెస్‌ఫుల్ చేసి, 2017 వరకు సేవలందించారు. తిరిగి 2017లో ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. టెక్నాలజీ రంగంలో నందన్ నీలేకనికి సుదీర్ఘ అనుభవం ఉన్నది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడంలో ఎక్స్‌పర్ట్. ఎగ్జామ్స్‌ను పకడ్బందీగా నిర్వహించాలంటే టెక్నాలజీనే కీలకమని కేంద్రం భావిస్తున్నది. అందుకే నందన్ నీలేకనిని టాస్క్‌ఫోర్స్ హెడ్‌గా నియమించింది. టెక్నాలజీ ఆధారంగా పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేయాలని కేంద్రం యోచిస్తున్నది.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026

