కలం, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ సైనికులకు, ఉగ్రవాదులకు తేడా లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా లద్దాక్‌లోని ద్రాస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ అమర సైనికులకు నివాళులు అర్పించారు. 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో ప్రాణ త్యాగాలు చేసిన సైనికులను దేశం ఎప్పటికీ స్మరించుకుంటూనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌పై రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతూ ఎదుగుతుంటే.. పాక్ ఉద్రవాదాన్ని పెంచి పోషిస్తూ అరాచక శక్తిగా ఎదుగుతోందన్నారు.
ఇక కార్గిల్ వార్‌ను స్మరించుకుంటూ నాటి సైనికుల త్యాగాలను గుర్తు చేశారు. భారత సైనికులు తమ పరాక్రమంతో పోరాడి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. నాటి నుంచి నేటి వరకు భారత్, పాక్ మధ్య వ్యత్యాసాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తూనే ఉన్నాయన్నారు. భారత్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తుంటే, పాకిస్థాన్ ఉగ్రవాద ఎకోసిస్టమ్‌ను పెంచుతోందన్నారు. భారత్ చిప్ డిజైన్‌లో ముందుకు సాగుతుంటే, పాకిస్థాన్ టెర్రర్ డిజైన్‌లో నిమగ్నమై ఉందని విమర్శించారు. భారత్ ఆవిష్కరణలు, అభివృద్ధిలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంటే, పాకిస్థాన్ ఉగ్రవాదం, చొరబాట్లకు ప్రాధాన్యం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్రాస్ వేదికగా రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) దేశ ప్రజలకు కీలక సందేశాన్ని అందించారు. జాతీయ భద్రత కేవలం సైనికుల బాధ్యత మాత్రమే కాదని, దేశ ప్రజల ఉమ్మడి బాధ్యత అని తెలిపారు. ప్రతి భారతీయుడికి దేశమే ముందు అనే భావన ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన సాయుధ దళాలు నిరంతరం ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని, దేశ రక్షణ ఉత్పత్తి రంగం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో స్వయం సమృద్ధి సాధిస్తోందని తెలిపారు.
Read Also: రాజకీయాలకు గుడ్ బై.. మాజీ సీఎం సంచలన నిర్ణయం
Follow Us On : WhatsApp

