కలం, హనుమకొండ: శాసనసభ స్పీకర్‌పై అనుచిత, అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమేనని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య (Kadiyam Kavya) అన్నారు. స్పీకర్ ఏ కులం, మతానికి చెందిన వారన్నది కాకుండా రాజ్యాంగబద్ధమైన పదవిని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ చెప్పాలని సూచించారు. బుధవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. మహిళా పోలీసుల పట్ల కేటీఆర్, హరీష్‌రావు వ్యవహరించిన తీరుపై కూడా ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీజీపీ, పోలీస్ కమిషనర్, అసెంబ్లీ సెక్రటేరియట్ ఘటనను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే అసెంబ్లీలో ప్రశ్నించాలని, ప్రజా సమస్యలపై పోరాటం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉండాలని కడియం కావ్య (Kadiyam Kavya) అన్నారు.
కాళోజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి..
అనంతరం కాళోజీ నారాయణరావు (Kaloji Narayana Rao) 112వ జయంతి సందర్భంగా విగ్రహానికి ఎంపీ పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ కేవలం కవి మాత్రమే కాదని.. అన్యాయం, అసమానతలపై ప్రశ్నించే పోరాట స్ఫూర్తికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఆయన రచనలు నేటి తరానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని, యువత కాళోజీ సాహిత్యాన్ని చదివి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఛాహత్ బాజ్‌పాయ్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : ఫామ్‌హౌస్ నుంచే అసెంబ్లీ కుట్ర: రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On: X(Twitter)

