కలం, ఖమ్మం బ్యూరో: పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులను వేధించే ఈవ్ టీజర్లకు, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసే సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీసులు సమాయత్తమయ్యారు. పాఠశాలలు, కళాశాలల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ జిల్లావ్యాప్తంగా “పోలీస్ అక్క” (Police Akka) కార్యక్రమాన్ని రంగంలోకి దించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహిళా పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నియమితులైన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు ఇకపై ‘పోలీస్ అక్క’ (Police Akka)లుగా విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శిస్తారని తెలిపారు. విద్యార్థినులతో స్నేహపూర్వకంగా మమేకమవుతూ, వారికి ఏవైనా సమస్యలు ఉంటే భయం లేకుండా నిర్భయంగా చెప్పుకునేలా విశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, స్టాకింగ్, బుల్లీయింగ్ వంటి వేధింపులతో పాటు నేటి తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, బాలల రక్షణ, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై విద్యార్థుల్లో సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.
విద్యాసంస్థల్లో ఏవైనా నేరాలకు లేదా వేధింపులకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే ‘పోలీస్ అక్క’లు క్షణం ఆలస్యం చేయకుండా సంబంధిత షీ టీమ్ ఎస్‌హెచ్‌ఓకు సమాచారం అందించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, జిల్లాలోని మహిళలు, బాలికల భద్రతకు సంపూర్ణ భరోసా కల్పించడంలో ప్రతి మహిళా పోలీసు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, షీటీం ఎస్‌హెచ్‌ఓ రమాదేవి, జిల్లాలోని మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: 56 అంగుళాల ఛాతీ యువత ముందు తలొగ్గింది : సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

