కలం, ఖమ్మం బ్యూరో: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఓ మహిళ మృతి చెందిందంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని (Bhadrachalam) ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మృతురాలి బంధువులు, మద్దతుదారులు ఆగ్రహంతో ఆసుపత్రి రిసెప్షన్ వద్ద పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో కలకలం రేగింది.
బంధువుల వివరాల ప్రకారం.. పాల్వంచ (Palvancha) మండలం దొంతలపాడు గ్రామ సర్పంచ్ వెంకటరమణ కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం అనంతరం ఆమెను భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స తర్వాత ఇంటికి వెళ్లినప్పటికీ కాలు వాపు తగ్గకపోవడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటరమణ మృతి చెందారు.
భద్రాచలం (Bhadrachalam) ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఆసుపత్రి లోపలికి వెళ్లి రిసెప్షన్ వద్ద పెట్రోల్ పోసి మంట పెట్టారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రిసెప్షన్ వద్ద ఉన్న కుర్చీలు, టేబుళ్లు కాలిపోయాయి. ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వైద్యుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలతో పాటు ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
Follow Us On : WhatsApp

