కలం, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీకేజీలపై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేపట్టిన నిరసనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సెటైర్లు వేశారు. నేడు కేటీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో 50 ఏళ్ల వయసులోనే ట్టిట్టర్ టిల్లు జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు ఉన్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీకులు జరిగాయని, కేటీఆర్ జ్ఞాపకశక్తి కోల్పోయిన నేపథ్యంలో కొన్ని విషయాలను మరోసారి గుర్తు చేస్తున్నాననంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలో టీఎస్పీఎస్సీ, ఈఏపీసెట్ (ఈఏంసెట్), ఎస్ఎస్సీ పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకున్నాయని బండి పేర్కొన్నారు. ఆ పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా తాను నిరసన చేపడితే తనను అరెస్ట్ చేశారన్నారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీట్ పేపర్ లీక్‌కు విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీక్‌లు జరిగినప్పుడు కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ ఎందుకు రాజీనామా చేయలేదు? అని బండి ప్రశ్నించారు.
నీట్ విషయంలో నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థులు పోలీసులపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారని, 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వారి తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించిందో మర్చిపోయారా? అని నిలదీశారు. ఆ 27 మంది విద్యార్థుల మరణాలకు బాధ్యులైన వారిపై ఇప్పటికీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

