కలం, స్పోర్ట్స్ : పాకిస్థాన్‌తో(Pakistan) శనివారం నుంచి తారోబాలో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు వెస్టిండీస్ (West Indies) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ (Alzarri Joseph) ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదని వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ వెల్లడించారు. గతంలో గాయం నుంచి కోలుకున్న అల్జారీ జోసెఫ్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ, అతను ఆడేందుకు నిరాకరించినట్లు సమీ విలేకరుల సమావేశంలో తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల జోసెఫ్ సిరీస్‌కు దూరమయ్యాడని క్రికెట్ వెస్టిండీస్ ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు కోచ్ కూడా అదే విషయాన్ని ధ్రువీకరించారు.
జోసెఫ్ తీసుకున్న నిర్ణయం జట్టుకు పెద్ద లోటని సమీ పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత ఆడేందుకు నిరాకరించడం వంటి అంశాలపై క్రికెట్ వెస్టిండీస్ బోర్డు తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వెస్టిండీస్ తరఫున అన్ని ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించిన అల్జారీ జోసెఫ్ ఇప్పటివరకు 42 టెస్టులు ఆడి 130 వికెట్లు పడగొట్టాడు. అతని గైర్హాజరీ జట్టుకు నష్టమే అయినప్పటికీ, తమ బౌలింగ్ విభాగంపై పూర్తి నమ్మకం ఉందని సమీ తెలిపారు. జట్టులో షమర్ జోసెఫ్, కెమార్ రోచ్, జేడెన్ సీల్స్‌తో పాటు ఆల్‌రౌండర్లు జస్టిన్ గ్రీవ్స్, కీమో పాల్ ఉన్నారని, స్పిన్ విభాగంలో జోమెల్ వారికన్, యువ స్పిన్నర్ జాషువా బిషప్‌తో పాటు కెప్టెన్ రోస్టన్ చేజ్ కూడా అందుబాటులో ఉన్నారని చెప్పారు.
ప్రత్యర్థిని ఆలౌట్ చేసే సామర్థ్యం తమ బౌలర్లకు ఉందని సమీ ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారని, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో బ్యాటర్‌లు కూడా ఆకట్టుకున్నారని గుర్తు చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమష్టిగా రాణిస్తే పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌లో విజయాలు సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

