కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఇల్లందు (Yellandu) పట్టణంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గౌతమ బుద్ధ ఐటీఐ కళాశాల సమీపంలో ఇసుక లారీ ఢీకొనడంతో స్థానిక రెండో నంబర్ బస్తీకి చెందిన నరేష్ (30) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేష్ శుక్రవారం గౌతమ బుద్ధ ఐటీఐ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, అదే మార్గంలో అతివేగంగా వచ్చిన ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు నరేష్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యల కోసం దర్యాప్తు చేపట్టారు.

