కలం, వెబ్ డెస్క్: దేశంలో పేపర్ లీకేజీల కట్టడికి మరింత కఠినమైన చట్టాలు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రకటించారు. నీట్ పరీక్ష అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని కేంద్ర కేబినెట్ శుక్రవారం పరిశీలించనుందని తెలిపారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
కేబినెట్లో చర్చించాక తుదిరూపు..
పరీక్షల పేపర్ లీకులు లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయని అన్నారు. ఇలాంటి ఘటనలను సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటన అనంతరం విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా వేగంగా రీ-ఎగ్జామ్ నిర్వహించి, జులై 19న ఫలితాలు ప్రకటించామని తెలిపారు. పేపర్ లీక్ వ్యవహారంలో పలువురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించామని, అంతటితో ఆగకుండా మరిన్ని కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామని మోదీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, కఠిన శిక్షలకు సంబంధించిన నిబంధనలతో చట్టం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన తుది మార్పులను కేబినెట్ ఆమోదించిన తర్వాత, రాబోయే సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు.
హాని చేసిందే మీరు: రాహుల్
అయితే, పేపర్ లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం సాయంత్రమే మోదీ ప్రకటించగా, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మన యువత భవిష్యత్తుకు హాని చేసింది మీరేనంటూ ఎక్స్ (ట్విటర్) వేదికగా ధ్వజమెత్తారు. మన విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతుంటే చూస్తూ ఊరుకున్నారని, ఈ అక్రమాలకు బాధ్యులైన వారిని రక్షించారని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థుల డిమాండ్లు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన.. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటనను కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా పూర్తిగా తిరస్కరించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సిందేననే పునరుద్ఘాటించింది.

