epaper
Friday, January 16, 2026
spot_img
epaper

సీఎం, శ్రీధర్‌బాబుకు మధ్య కుదిరిన సయోధ్య?

కలం డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy), మంత్రి శ్రీధర్‌బాబుకు (Sridhar babu) మధ్య చోటుచేసుకున్న అగాధం తొలగిపోయిందా?.. ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు సమసిపోయినట్లేనా?.. వారిద్దరి మధ్య సయోధ్య కుదిరిందా?.. ఇలాంటి పలు రకాల ప్రశ్నలకు తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీ ‘ఔను’ అనే సమాధానాన్ని ఇస్తున్నది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్‌రంజన్‌ను ఆ శాఖతో ఎలాంటి సంబంధం లేని పురపాలక శాఖకు బదిలీ కావడం ఇందుకు ఫస్ట్ స్టెప్ అనే మాటలు వినిపిస్తున్నాయి. పరిశ్రమల శాఖ నుంచి ఆయనను బదిలీ చేసినా సీఎంఓలో ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్ సెల్, ‘స్పీడ్’ విభాగాల బాధ్యతలను అప్పజెప్పడం మంత్రి శ్రీధర్‌బాబుకు మింగుడుపడలేదనే వాదన అప్పట్లో వినిపించింది. ఇప్పుడు జయేశ్‌రంజన్‌ను (IAS Jayesh Ranjan) అటు సీఎంఓ నుంచి ఇటు పరిశ్రమల శాఖతో సంబంధం లేకుండా బదిలీ చేయడంతో సీఎం, శ్రీధర్‌బాబు మధ్య వివాదం సమసిపోయినట్లయిందనే టాక్ వినిపిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా జయేశ్ రంజన్ కొనసాగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా ఆయనే కొనసాగారు. మంత్రి శ్రీధర్‌బాబు, జయేశ్‌రంజన్ మధ్య సరైన సమన్వయం లేదన్న ఆరోపణలతో పరిశ్రమల శాఖ నుంచి జయేశ్ రంజన్‌ను ప్రభుత్వం తప్పించింది. కానీ తిరిగి సీఎంఓలో ఆ వ్యవహారాలు చూసే బాధ్యతలే ఇవ్వడంతో మంత్రి ఒకింత అసహనానికి గురయ్యారని ఆ శాఖ వర్గాల్లో చర్చ మొదలైంది. అప్పటి నుంచీ ముఖ్యమంత్రికి, మంత్రి శ్రీధర్‌బాబుకు (Sridhar Babu) మధ్య కాస్త గ్యాప్ పెరిగిందని, ఇది గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో బహిరంగమైందని సచివాలయ వర్గాల్లోనూ ఓపెన్‌గానే మాటలు వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అధికారి కారణంగా మంత్రుల మధ్య తేడాలు లేకుండా తాజాగా బదిలీ ఉత్తర్వులు జారీ కావడాన్ని ఆ వర్గాలు ఉదహరించాయి.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వచ్చే ఏడాది మార్చిలో రిటైర్ అయిన తర్వాత తదుపరి సీఎస్‌గా జయేశ్‌రంజన్‌కు అవకాశం వస్తుందన్న మాటలూ వినిపించాయి. అలాంటి హోదాను కాదని ఇప్పుడు కేవలం హెచ్ఎండీఏ లిమిట్స్ కు మాత్రమే పరిమితం చేస్తూ ఆయనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం స్పెషల్ సీఎస్‌గా నియమించడం గమనార్హం. అదే సమయంలో గ్లోబల్ సమ్మిట్‌లో అంతా ముందుండి నడిపించారని చెప్పుకున్న మరికొందరిపై కూడా బదిలీ వేటు పడింది. నర్సింహారెడ్డిని మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించడాన్ని సచివాలయ వర్గాలు గుర్తుచేశాయి. మరోవైపు మంత్రి శ్రీధర్‌బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న భవేష్ మిశ్రాకు ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్ సెల్, స్పీడ్ విభాగం అదనపు సీఈఓ బాధ్యతలు ఇవ్వడం గమనార్హం. ఇప్పటివరకూ సీఎంఓలో ఆ బాధ్యతలు చూసిన జయేశ్‌రంజన్‌ను తప్పించడంతో ఇకపైన ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా టేకప్ చేయనున్నారు.

Read Also: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>