కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీడియా చిట్ చాట్ లో సీఎం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నిజంగానే అంత గొప్ప నాయకుడైతే గత ప్రభుత్వంలో ఆయనను మంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివిధ అంశాలను మ్యానిపులేట్ చేసి, వందల కోట్లు సంపాదించారనే కారణంతోనే గతంలో ఆయన శాఖను మార్చారని సీఎం ఆరోపించారు. అతి తెలివి తేటలతో హరీష్ రావు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ (BRS) శ్రేణులను గట్టిగా నిలదీశారు. ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలంటే ముందుగా తగిన పరీక్షలు నిర్వహించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని, ఆ నిబంధనలను పాటించాలా వద్దా అని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న నేపథ్యంలో అసలు నీటిని ఎక్కడ నుండి ఎత్తి పోయాలో చెప్పాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో పంపులు, బిల్లులు, కమిషన్ల కథ మాత్రమే నడిచిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు కన్నెపెల్లి పంప్ హౌజ్ గురించి మాట్లాడుతున్నారు తప్ప, అసలు సమస్య అయిన మేడిగడ్డ గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు తీవ్రంగా స్పందిస్తారనే భయంతోనే వారు దాటవేస్తున్నారని సీఎం (Revanth Reddy) అన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని నిర్మించింది, దానిని కూల్చింది కూడా బీఆర్ఎస్ నాయకులేనని ముఖ్యమంత్రి ఆరోపించారు. తాము కేంద్ర దర్యాప్తు సంస్థలను మేనేజ్ చేసుకున్నామని, అందుకే ఎదురుదాడి చేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో కాఫర్ డ్యాం ఎందుకు నిర్మించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎందుకు తగ్గిపోయిందో హరీష్ రావు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.
Read Also: విద్యార్థులకు అలర్ట్.. రేపటి పరీక్షలు వాయిదా
Follow Us On: X(Twitter)

