కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మీడియా చిట్ చాట్‌లో బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధర్నా చౌక్‌లో సేకరించిన రక్తాన్ని గాంధీ లేదా ఉస్మానియా ఆసుపత్రులకు ఇచ్చి ఉంటే బాగుండేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ రక్తదానం చేయలేదని విమర్శించిన ఆయన, అసలు సేకరించిన రక్తాన్ని ఎవరికి అమ్ముకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒంట్లో కొవ్వెక్కి ఉన్నవాళ్లు రక్తం ఇస్తే అది కరిగిపోతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రజలను ఇలాగే రెచ్చగొట్టారని, నాడు అమాయకుల ప్రాణాలు తీసుకున్న వాళ్లే ఇప్పుడు రక్తం తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
గ్లోబరీనా వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తాము గ్లోబరీనా(Globarina)పై విచారణ చేపడితే ప్రతిపక్షాలు కక్ష సాధింపు చర్యలుగా చిత్రీకరిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క చిన్న ఫిర్యాదు ఇస్తే చాలని, వెంటనే గ్లోబరీనాపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని సవాల్ విసిరారు. ప్రస్తుతం గ్లోబరీనాపై విచారణ జరగడం లేదని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించిన సీఎం, దీనిపై ఫిర్యాదు చేయడం ద్వారా కేటీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించిన అధికారిక నివేదిక రాగానే చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేరును ఒక రహదారికి పెట్టడంపై స్పందిస్తూ, ఆయన ఇక్కడ పెట్టుబడి పెట్టాడు కాబట్టే ఆ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
Read Also: రెండు చోట్లా ఓట్లు.. సీఎం రేవంత్ క్లారిటీ!
Follow Us On : WhatsApp

