కలం, వెబ్‌డెస్క్: ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీ (AP Mega DSC) రిక్రూట్‌మెంట్‌లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వైసీపీ సభ్యులు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి (Gurumoorthy) వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపించాలని సభ దృష్టికి తీసుకెళ్లారు.
ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఎంపీలు పేర్కొన్నారు. ఈ అక్రమాల వల్ల నిజమైన ప్రతిభావంతులకు, అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ప్రక్రియలో జరిగిన ఈ కుంభకోణంపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

