కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ (Telangana Future City) ప్రాజెక్టుపై వివిధ సెక్షన్ల పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం క్రమంగా పెరుగుతున్నది. ఇంతకాలం భూముల క్రయవిక్రయాలకే పరిమితమైన ఆ ప్రాంతం ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించే ఏరియాగా మారుతున్నది. ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలవుతున్నాయి. ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.
అన్ని అంశాలను పరిశీలించి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కూడా ఊపందుకున్నది. కొన్ని సంస్థలకు ఇప్పటికే పర్మిషన్స్ మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 390 అప్లికేషన్లు రాగా.. 104 క్లియర్ అయ్యాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లుగానే ఫ్యూచర్ సిటీ ‘రియల్’ సిటీగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. భవన నిర్మాణాలు, ప్లాట్ల లేఔట్, అపార్టుమెంట్లు/విల్లాల నిర్మాణం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రిక్వెస్టులు.. వీటన్నింటితో ప్రభుత్వం ఇప్పటివరకూ కాగితాల మీద వేసుకున్న లెక్కలు వాస్తవ రూపం దాలుస్తున్నాయనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతున్నది.
విజన్‌తోనే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్
ఇప్పటివరకూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనే మూడు రకాల నగరాలు ఉన్నాయని, వీటికి తోడు కొత్తగా ఫోర్త్ సిటీగా ‘ఫ్యూచర్ సిటీ’ వస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది ఏ రూపంలో ఉండనున్నదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. దానిపై విశ్వాసం కలిగించేందుకు ఆ ప్రాంతంలోనే గతేడాది డిసెంబరులో ‘గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్’ నిర్వహించి ‘తెలంగాణ రైజింగ్ విజన్ – 2047’ అనే డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
ఫ్యూచర్ సిటీలో ఏమేం ఉంటాయో వివరించి సుమారు రూ.5.77 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలను సీఎం కుదుర్చుకున్నారు. దానికి ముందు, తర్వాత స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన సమ్మిట్‌లోనూ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రైజింగ్ విజన్ గురించి వివరించారు. ఆ ముందుచూపులో భాగంగానే పలు కంపెనీలు ఫ్యూచర్ సిటీలో యూనిట్లను స్థాపించడానికి ఆసక్తి చూపాయి. వారం రోజుల క్రితమే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒక డేటా సెంటర్ పెట్టడానికి శంకుస్థాపన జరిగింది.
కన్సల్టెంట్‌గా ‘డీపీ ఆర్కిటెక్చర్’
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థలను కన్సల్టెంట్‌గా నియమించుకునేలా టెండర్లు ఆహ్వానిస్తే ఆరు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపాయి. అందులో సింగపూర్‌కు చెందిన డీపీ ఆర్కిటెక్చర్ అనే కంపెనీ తక్కువ రేటుతో ఎంపికైంది. తొమ్మిది నెలల్లో మాస్టర్ ప్లాన్ ఇచ్చేలా అవగాహన కుదిరింది. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో రూపొందిన హెచ్ఎండీ మాస్టర్ ప్లాన్ (ఫ్యూచర్ సిటీ కలుపుకుని) కూడా తుది ప్లాన్‌లో భాగంగా ఉంటనున్నది.
మొత్తం మూడు భాగాలుగా ఉండే మాస్టర్ ప్లాన్‌లో ఫ్యూచర్ సిటీ ఉత్తరం భాగంలో రీజినల్ కారిడార్లు, ట్రాన్స్ పోర్టు నెట్ వర్క్స్, మెట్రోపాలిటన్ సెంటర్లు ఉంటాయి. సెంట్రల్ పార్టులో ఇండస్ట్రియల్ సెంటర్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్ డ్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు ఉంటాయి. దక్షిణ భాగంలో ఇప్పటికింకా నిర్దిష్టమైన ప్లానింగ్ జరగలేదు. ఈ మూడింటినీ కలిపి డీపీ ఆర్కిటెక్చర్ తుది మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. మొత్తం 765 చ.కి.మీ. విస్తీర్ణంలో 30 వేల ఎకరాల పరిధిలో ఏయే రంగాల పరిశ్రమలు ఫ్యూచర్ సిటీలో ఉంటాయన్నది తుది మాస్టర్ ప్లాన్‌లో వెల్లడి కానున్నది.
ప్రాధాన్యతలకు తగ్గట్టు అంచనాలు
ఫ్యూచర్ సిటీలో మొత్తం 30 వేల ఎకరాల స్థలాన్ని గుర్తించి దాన్ని ఏ అవసరాలకు వాడాలో కేటగిరీలుగా చేసి మౌలిక సౌకర్యాలు ఏ స్థాయిలో ఉండాలో నిర్ధారణకు రావడం కీలకమైన అంశం. ప్రాథమికంగా ప్రభుత్వం వేసుకున్న అంచనా ప్రకారం సుమారు 13 వేల ఎకరాలు ప్రయారిటీ డెవలప్‌మెంట్ అవసరాల కోసం వినియోగంలోకి రానున్నది.
రంగాలవారీగా చూస్తే లైఫ్ సైన్సెస్ హబ్‌కు 4 వేల ఎకరాలు, ఈవీ-ఎనర్జీ పార్క్ కోసం 1976 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ అడ్వాన్స్ డ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ అవసరాలకు 2177 ఎకరాలు, రెసిడెన్షియల్ జోన్ కోసం 2477 ఎకరాలు, డేటా సెంటర్ హబ్‌కు 313 ఎకరాలు, ఎడ్యుకేషన్-యూనివర్శిటీ జోన్ ఏర్పాటుకు 255 ఎకరాలు, ఏఐ సిటీ కోసం 403 ఎకరాలు, హెల్త్ సిటీకి 594 ఎకరాలు.. ఇలా అంచనాలు వచ్చాయి. ప్రస్తుతం ఎంటర్‌టైన్ మెంట్ జోన్, ఫర్నీచర్ పార్కు, స్పోర్ట్స్ హబ్ కోసం ప్రతిపాదనలు, వాటికి అవసరమైన స్థలం కేటాయింపుపై కూడా ప్రాథమిక అంచనాలు వచ్చాయి.
అథారిటీ, కమిషనరేట్ ఏర్పాటు
ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయడానికి ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని నెలకొల్పింది. ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. యాక్టివ్‌గా ఉండే ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక టాస్క్ ఇచ్చింది. ఎఫ్‌సీడీఏ గవర్నంగ్ బోర్డు చైర్మన్‌గా సీఎం వ్యవహరిస్తూ రెవెన్యూ, ఫైనాన్స్, ఇండస్ట్రీస్, ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ తదితర పలు విభాగలకు చెందిన అధికారులు మెంబర్లుగా ఉన్నారు.
ఎనిమిది నెలల్లోనే పనులు కంప్లీట్ చేసుకున్నదంటూ అధికారులను ప్రశంసించిన ముఖ్యమంత్రి జూన్ సెకండ్ వీక్‌లో ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ ఫ్యూచర్ సిటీ కాలుష్యం లేని ‘నెట్ జీరో’గా రాణిస్తుందని, ప్రపంచానికే గుర్తింపు తెచ్చేలా ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పనులు సత్వరం పూర్తికావాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఉన్న డిపార్టుమెంట్లకు కాకుండా ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి పలు సవాళ్లు
సుమారు 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి రోడ్లు, నీటి సరఫరా వ్యవస్థ, డ్రైనేజీ సౌకర్యాలు, విద్యుత్ సప్లై, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, స్కూళ్లు, ఆస్పత్రులు.. ఇలాంటి మౌలిక సౌకర్యాలనూ కల్పించాల్సి ఉంటుంది. భూ సేకరణ, ప్రజల నుంచి ఎదురయ్యే వ్యతిరేకత.. ఇవన్నీ సవాళ్ళుగా ఉన్నాయి. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్, షాద్‌నగర్ అనే ఏడు మండలాల పరిధిలోని 56 గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ వస్తుండడంతో కోర్ డెవలప్‌మెంట్ జోన్‌గా మారుతుందన్నది ప్రభుత్వ వాదన.
ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆరుట్లలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభమైంది. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు గురించి ప్రస్తావించిన సీఎం.. ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా రేడియల్ రోడ్ల నిర్మాణం ఉంటుందన్నారు. ప్రతిపక్షాలు దీన్ని ‘ఫ్యూచర్ లెస్ సిటీ’ అని చెప్తున్నా.. సీఎం దీన్ని డ్రీమ్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఈ డెవలప్‌మెంట్‌పై స్పష్టమైన అంచనాకు వచ్చిన రియల్ ఎస్టేట్ రంగం అనుమతుల కోసం ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి వచ్చిన అప్లికేషన్ల తాజా స్టేటస్ (జులై 16 నాటికి) :
వచ్చిన అప్లికేషన్లు : 390
అప్రూవ్ అయినవి : 104
అసంపూర్తిగా ఉన్నవి : 99
రిజెక్ట్ అయినవి : 34
పరిశీలనలో ఉన్నవి : 59
ఇందులో భవన నిర్మాణాల అనుమతులకు : 281
ఆక్యుపెన్సీ కోరినవి : 21
ప్లాట్ల లేఔట్ : 79
ఇండ్ల నిర్మాణానికి లే ఔట్ : 9

