కలం, ఖమ్మం బ్యూరో: ఎగువ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా జలాశయం (Taliperu Reservoir) నిండుకుండలా మారింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల అనంతరం ఎట్టకేలకు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తడంతో ఆయకట్టు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఛత్తీస్గఢ్ నుండి జలాశయానికి 9,679 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం ప్రాజెక్టుకు చెందిన 15 గేట్లను ఎత్తారు.
ప్రస్తుతం దిగువన ఉన్న గోదావరి నదికి 10,739 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్దకు డీఈ తిరుపతి, ఏఈఈ సంపత్ చేరుకొని వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. ఎగువ ప్రవాహానికి అనుగుణంగా గేట్ల ద్వారా నీటిని నిరంతరం నియంత్రిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ జలాశయం పరిధిలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో దాదాపు 24,700 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కింద రైతులు ఇప్పటికే వరి సాగు చేపట్టారు. తొలిసారిగా ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు చేరడంతో తమ పంటలకు ఇక డోకా ఉండదని, సాగునీటి కొరత తీరినట్లేనని ఈ ప్రాంత రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

