కలం, వెబ్ డెస్క్ : న్యూఢిల్లీలో నీట్ పరీక్షల అంశంపై ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని సీఎం (CM Revanth Reddy) ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీక్ వంటి కీలక అంశాలపై దేశ యువత సమాధానాలు కోరుతోందని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
“మమ్మల్ని జైల్లో వేసినా, అణచివేసినా కోట్లాది యువత ఆగ్రహాన్ని అణచివేయలేరు” అంటూ సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీసుకున్న చర్యలను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ యువతతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

