కలం, చండూరు ( గట్టుప్పల): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని రైతులు,కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలనిరైతు సంఘం రాష్ట్ర కమిటీ బండ శ్రీశైలం అన్నారు. మంగళవారం గట్టుప్పల (Gattuppal) మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టాన్ని పార్లమెంట్లో చేయాలని, జస్టిస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలన్నారు. మూడోసారి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రైతులకు నష్టం చేసే నల్లచట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక సంఘాలు నిర్వహించగా.. దాదాపు 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని గుర్తు చేశారు. కార్మిక ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926, ఇండస్ట్రియల్ డిస్ప్లే యాక్ట్ 1947 , ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యాక్ట్ కలిపి సంఘం పెట్టుకునే హక్కు మీద దాడి చేస్తున్నారని.. 1926లో బ్రిటిష్ కాలంలో సాధించుకున్న కార్మిక హక్కులను వంద సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వం హరించి వేయడం అన్యాయమని పేర్కొన్నారు. 300 మంది లోపు కార్మికుల ఉన్న పరిశ్రమల లే ఆఫ్ లాకౌట్ లకు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చేయడం, ఐరన్ ఫైర్ సిస్టం ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ సిస్టం తీసుకురావడం ఉద్యోగ భద్రతకు స్వస్తి పలకడమేనని అన్నారు.
ఈ నేపథ్యంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సిఐటియు – రైతు- వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు వివిధ రూపాలలో తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల మండల కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు కర్నాటి సుధాకర్, పడసబోయిన యాదగిరి, కర్నాటి వెంకటేశం, రావుల నరసింహ, వల్లూరి శ్రీశైలం, పెదగాని నరసింహ, ముసుకు బుచ్చిరెడ్డి, మల్గే శివ తదితరులు పాల్గొన్నారు.

