కలం, నిర్మల్: బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని (RTC Retired Employees) ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయనకు వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల యోగక్షేమాలు, వారి ప్రస్తుత పరిస్థితులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో 38 సంవత్సరాలపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన 34,188 మంది ఉద్యోగులకు 2017, 2021 సంవత్సరాలకు సంబంధించిన పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ అందలేదన్నారు.
పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ, వైద్య ఖర్చులు, ఇతర కనీస అవసరాలు తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

