రిటైర్మెంట్ రూమర్లకు రోహిత్ సెంచరీతో చెక్

కలం, స్పోర్ట్స్: రిటైర్మెంట్ ప్రచారం… భవిష్యత్తుపై సందేహాలు… విమర్శలు. ఇవన్నింటికీ రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వేదికగా అద్భుత సెంచరీతో మరోసారి తన క్లాస్ చూపించాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు ముందే ఇది రోహిత్ చివరి మ్యాచ్ కావచ్చన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి కూడా స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. అయినా ఊహాగానాలు మాత్రం ఆగలేదు. అయితే మైదానంలోకి దిగిన రోహిత్ మాత్రం ఎక్కడా ఒత్తిడికి గురైనట్లు కనిపించలేదు. తన పని జట్టుకు ఆడటమేనని, బయట వచ్చే ప్రచారాన్ని పట్టించుకోవడం లేదని మ్యాచ్ అనంతరం చెప్పాడు.

మైదానంలో తాను చేసే ప్రదర్శనే తనకు ముఖ్యమని పేర్కొన్నాడు. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు రోహిత్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. ఇన్నింగ్స్‌ను ఓపికగా నిర్మించాడు. తర్వాత వేగం పెంచాడు. 69 బంతుల్లో 69 పరుగుల వద్ద ఉన్న రోహిత్ (Rohit Sharma).. తర్వాత కేవలం 31 బంతుల్లోనే మరో 52 పరుగులు చేశాడు. 84 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. చివరకు 138 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్‌లో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

ఇది అతని కెరీర్‌లో 34వ వన్డే సెంచరీ. ఇంగ్లండ్ గడ్డపై ఎనిమిదో వన్డే శతకం కూడా ఇదే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించాడు. ఇది ఇద్దరి 21వ వన్డే సెంచరీ భాగస్వామ్యం. అలాగే ఇద్దరూ కలిసి ఆడిన 400వ అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇదే. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లీ పోరాటం కొనసాగించాడు. 60 బంతుల్లో 74 పరుగులు చేశాడు. కానీ భారత్‌ను విజయానికి చేర్చలేకపోయాడు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

మ్యాచ్ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రశంసించాడు. కొత్త బంతిని జాగ్రత్తగా ఎదుర్కొని, తర్వాత దూకుడుగా ఆడిన తీరు అద్భుతమని తెలిపాడు. రోహిత్-కోహ్లీ అనుబంధంపై కూడా భారత కెప్టెన్ మాట్లాడాడు. ఇద్దరూ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నామని, ఒకరి ఆటను మరొకరు బాగా అర్థం చేసుకుంటామని, అందుకే భాగస్వామ్యాలు విజయవంతమవుతున్నాయని చెప్పాడు.

ఇదిలా ఉండగా, రోహిత్ రిటైర్మెంట్‌పై వస్తున్న ప్రచారాన్ని శుభ్‌మన్ గిల్ కూడా ఖండించాడు. జట్టులో అలాంటి చర్చ ఏదీ జరగలేదని స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ 144 పరుగులు చేయగా, రోహిత్ 175 పరుగులతో ముగించాడు. భారత్ తదుపరి వన్డే సిరీస్‌ను సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>