కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital)ని పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సోమవారం సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీస్ అవుట్‌పోస్ట్ పనితీరును సమీక్షించారు. మెడికో–లీగల్ కేసుల నమోదు, విచారణ, రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
డీ-అడిక్షన్ కేంద్రం పరిశీలన..
అనంతరం మత్తు పదార్థాలకు బానిసైన యువతకు చికిత్స అందిస్తున్న డీ-అడిక్షన్ కేంద్రాన్ని సీపీ శ్వేత సందర్శించారు. అందిస్తున్న చికిత్సా విధానం, బాధితులను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి, వాహన పార్కింగ్ ప్రాంతాలు, కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలని..
రోగులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధాన ద్వారం వద్ద ఆటోలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. పార్కింగ్ వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించి, రాకపోకలు సజావుగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
సీపీ వెంట ఎంజీఎం సూపరింటెండెంట్ డా.రామ్‌కుమార్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, ఏసీపీలు జితేందర్ రెడ్డి, సదయ్య, సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, రాఘవేందర్, ఆర్‌ఎస్‌ఐలు పూర్ణచందర్ రెడ్డి, మనోజ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

