కలం, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunil Rao) సోమవారం కట్టరాంపూర్లోని (Katta Rampur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పరిస్థితులను, రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో సునీల్ రావు స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలపై రోగుల నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైద్యులను కలిసి ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య, ఎక్కువగా నమోదవుతున్న అనారోగ్య సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులలో డెంగ్యూ, మలేరియా, కుక్క కాట్లు, కోతి కాట్లు, ఇతర వైరల్ జ్వరాల పరిస్థితిపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, రోగులకు సకాలంలో మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలపై ఎంతో నమ్మకంతో ఆసుపత్రులకు వస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా సమయపాలన పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.
ఆసుపత్రి నిర్వహణలో లేదా వైద్య సేవల అందించడంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వైద్య సిబ్బందికి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలలో నమ్మకం మరింత పెరిగేలా భవిష్యత్తులోనూ మెరుగైన సేవలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సాయిరాజ్, వైద్య సిబ్బంది సాగర్, పావని, శ్వేత, సుమతి, చల్మెడ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

