కలం, నల్లగొండ: సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక రక్షకుడే భక్షకుడిగా మారిన ఘటన నల్లగొండ (Nalgonda) పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు (POCSO Case) నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల ఒక బాలిక సైకిల్‌పై వెళ్తుండగా, నిందితుడు ఆమెను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులపై బాధితురాలు ధైర్యంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించింది. నిందితుడు మాస్క్ ధరించి సంచరించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి చివరకు అతడిని పట్టుకున్నారు.
నిందితుడు గుర్రంపోడు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు కానిస్టేబుల్‌పై గతంలోనూ పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు గతంలో కూడా ఇతనిపై పలుమార్లు ఫిర్యాదులు అందినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇలాంటి నేర చరిత్ర, వరుస ఫిర్యాదులు ఉన్నప్పటికీ సదరు కానిస్టేబుల్‌కు వరుసగా పోస్టింగులు ఎలా లభించాయనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలోని పర్యవేక్షణా లోపంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. “పోలీస్ ముసుగులో బాలికలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్న ఇలాంటి క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలి. సదరు కానిస్టేబుల్‌పై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.” అని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఘటనపై స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు, బాలికలు, మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా, ఏ హోదాలో ఉన్నా చట్టం ముందు సమానులేనని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

