కలం, స్పోర్ట్స్ : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup) లో మూడో స్థానం మ్యాచ్‌కు ముందే ఫ్రాన్స్ ఫుట్‌బాల్ కోచ్ డిడియర్ డెషాంప్స్ (Didier Deschamps) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌తో ఈ మ్యాచ్ ఆడాలని తమకు లేదని స్పష్టం చేశారు. అయినా కాంస్య పతకం కోసం పోరాడటం తమ బాధ్యత అని చెప్పారు. స్పెయిన్ చేతిలో 2-0తో ఓడి ఫ్రాన్స్ వరుసగా మూడో ప్రపంచకప్ ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఇప్పుడు ఇంగ్లండ్‌తో మూడో స్థానం కోసం బరిలోకి దిగుతోంది.
మ్యాచ్‌కు ముందు డెషాంప్స్ మాట్లాడుతూ… ఈ పోరు ఫ్రెండ్లీ మ్యాచ్ కాదన్నారు. ఫైనల్‌కు చేరుకోలేకపోయినా, మూడో స్థానాన్ని సాధించడం తమ లక్ష్యమని చెప్పారు. ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ ఆడాలని కోరుకోవడం లేదని, తమ పరిస్థితి కూడా అలాంటిదేనని వివరించారు. ఫ్రాన్స్ జెర్సీ ధరించినప్పుడు చివరి వరకు పోరాడాల్సిన బాధ్యత ఉంటుందని డెషాంప్స్ అన్నారు. ఈ మ్యాచ్‌తోనే తన కోచ్‌గా ప్రయాణం ముగుస్తుందని తెలిపారు.
అయితే తన కోసం ఎవరూ బాధపడొద్దని, ఒక అధ్యాయం ముగిసినా జీవితం ముందుకు సాగుతుందని చెప్పారు. ఫ్రాన్స్ డిఫెండర్ ఇబ్రహిమా కోనాటే కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సెమీఫైనల్ ఓటమి తర్వాత మూడో స్థానం మ్యాచ్ ఆడాలని ఎవరికీ లేదని అన్నాడు. అయితే డెషాంప్స్ ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌కు ఎంతో సేవ చేశారని కోనాటే గుర్తు చేశాడు. ఆయనకు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని జట్టు నిర్ణయించుకుందని తెలిపాడు. కాంస్య పతకం సాధించి కోచ్‌కు ప్రత్యేకమైన కానుక ఇవ్వడమే ఇప్పుడు తమ లక్ష్యమని స్పష్టం చేశాడు.

