లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధులను మధ్యవర్తులు, అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన ఖర్చు కంటే, తాము అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లోనే ప్రజా సంక్షేమం, వైద్య సహాయం కోసం ఎక్కువ చేశామని వెల్లడించారు.

శనివారం పాలేరు నియోజకవర్గ పరిధిలోని నేలకొండపల్లి మండలంలో కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి పర్యటించారు. రూ.2 కోట్లకు పైగా వ్యయంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోనాయిగూడెం నుంచి నాచేపల్లి రోడ్డులో రూ.1.77 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన, సదాశివపురంలో రూ. 20 లక్షలతో నూతన పంచాయతీ భవనం, కోరట్లగూడెంలో రూ.16 లక్షల అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.

రైతులు తొందరపడొద్దు..

​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతులకు ఎకరాకు రూ. 6 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామని, పేదలకు కొత్త రేషన్ కార్డులతో పాటు నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

రైతులు తొందరపడి బోరు నీటిపై ఆధారపడి పంటలు వేసి నష్టపోవద్దని, నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత పెరిగితే సాగునీటి సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>