కలం, స్పోర్ట్స్ : లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగే నిర్ణయాత్మక ఆఖరి వన్డేకు ముందు టీమిండియాపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత్ కంటే ఇంగ్లాండ్‌కే గెలిచే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత జట్టు ఇంకా ఒక యూనిట్‌గా పూర్తిగా కుదురుకోకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సిరీస్ ప్రయాణాన్ని చూస్తే.. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.
ఆ తర్వాత కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో జో రూట్ 99 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో పుంజుకుంది. దీంతో ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలోనే లార్డ్స్‌లో విజేత ఎవరో తేల్చే ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతు.. ప్రస్తుతం రెండు జట్లూ యాభై యాభై శాతంతో సమానంగా ఉన్నాయని చెప్పారు. అయితే ఇంగ్లాండ్ స్వదేశంలో ఆడుతోంది కాబట్టి వారికి 51 శాతం అవకాశాలు ఉండి, కొంచెం పైచేయి సాధిస్తారని అభిప్రాయపడ్డారు.
టీ20 సిరీస్‌తో పాటు ప్రస్తుత వన్డే సిరీస్‌లో భారత ప్రదర్శన చూస్తుంటే జట్టు ఇంకా పూర్తిగా లయ అందుకోలేదని అనిపిస్తోందన్నారు. ఒకవేళ భారత్ ఒక యూనిట్‌గా రాణిస్తే.. మన జట్టుకే 60 శాతం గెలిచే అవకాశాలు ఉంటాయని ఐఏఎన్ఎస్ (IANS) ఇంటర్వ్యూలో విశ్లేషించారు. అయినా కూడా గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 65 పరుగులతో ఫామ్‌లోకి రావడం, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను నడిపిస్తుండడం భారత్‌కు సానుకూల అంశాలు.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ మళ్లీ జో రూట్ ఫామ్‌పైనే ఆశలు పెట్టుకుంది. భారత్ గనుక ఈ మ్యాచ్ గెలిస్తే.. లార్డ్స్ మైదానంలో 22 ఏళ్ల వన్డే నిరీక్షణకు తెరపడటంతో పాటు 2010 తర్వాత ఇంగ్లాండ్‌పై ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ సొంతమవుతుంది. ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై వస్తున్న చర్చలపైనా కపిల్ దేవ్ స్పందించారు. గంభీర్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీ మాత్రమేనని స్పష్టం చేశారు. గంభీర్ ఇప్పటివరకు చాలా మంచి పనితీరు కనబరిచారని చెబుతూ ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

