కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు, డాక్టర్లు లేక అల్లాడిపోతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని పరిస్థితుల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యవసర మందులు, సిరంజీలు, గ్లోవ్స్ వంటి ప్రాథమిక సామగ్రి కొరత తీవ్రంగా ఉందన్నారు. సకాలంలో వైద్యులు, నిపుణులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని వివరించారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం..
ప్రజల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడటం దారుణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులను గణనీయంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు.
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, తక్షణమే స్పందించి ఆసుపత్రి గత వైభవాన్ని తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

