ప‌క‌డ్బందీగా అట్రాసిటీ నిరోధక చట్టం అమలు: బక్కి వెంకటయ్య

కలం, కరీంనగర్ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను అధికారులు మానవీయ కోణంలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) ఆదేశించారు. బాధితులను గౌరవంగా కూర్చోబెట్టి వారి సమస్యలను ఓపికగా వింటేనే వారికి న్యాయం జరిగిందనే నమ్మకం కలుగుతుందని, వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ప్రతి అధికారి సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో స్వామి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించగా, అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు, అట్రాసిటీ కేసుల పురోగతి, విద్య, ఉపాధి, గురుకులాలు, గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర వివరాలను కమిషన్‌కు సమర్పించారు. బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో శిక్షల శాతం (కన్విక్షన్ రేట్) పెంచేందుకు పోలీసులు నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అట్రాసిటీ నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలన్నారు.

తహసీల్దార్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదులను అత్యంత సున్నితంగా, మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. మూఢనమ్మకాల నిర్మూలనతో పాటు ఎస్సీ, ఎస్టీ హక్కులు, చట్టాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహ ప్రోత్సాహకం, ఓవర్సీస్ విద్యా పథకం, స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ, ఎస్టీ బాధితుల పరిహారం తదితర పథకాలకు సంబంధించిన పెండింగ్ నిధుల పూర్తి వివరాలను వెంటనే ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కమిషనర్, కమిషన్‌కు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రితో సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించి పెండింగ్ నిధుల విడుదలకు కృషి చేస్తామని తెలిపారు.

పీఎం-అజయ్ (PM-AJAY) పథకం, అసైన్డ్ భూములు, ఎల్‌పీఎస్ (LPS) వంటి పథకాల కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ఎంపీడీవోల పర్యవేక్షణలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించి, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరై ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన చట్టాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి పెండింగ్ అంశాలను సమీక్షించాలని సూచించారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలయ్యేలా జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ ఔట్‌సోర్సింగ్ సొసైటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల్లో సామాజిక న్యాయం తప్పనిసరిగా ప్రతిబింబించాలని అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలవుతున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన మూడు పట్టణ స్థానిక సంస్థల్లో కూడా రూ.30 లక్షల యూబీఐ బీమా సదుపాయాన్ని అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించాలని, అర్హులైన బాధితుల వివరాలను వెంటనే సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సాంప్రదాయ వృత్తిదారులను గుర్తించి శిక్షణ, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ప్రహరీ గోడలతో సహా అవసరమైన మౌలిక వసతుల నిర్మాణాన్ని సంతృప్తి స్థాయి లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా యంత్రాంగం పనితీరును అభినందించిన బక్కి వెంకటయ్య, కరీంనగర్ అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, విద్య, ఉపాధి, జీవనోపాధి అంశాల్లో మరింత చొరవతో పనిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కమిషన్ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని, పెండింగ్ నిధుల పూర్తి వివరాలను నిర్ణీత సమయంలో కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో ఎస్సీ, ఎస్టీ చట్టాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు.

జిల్లా మండల స్థాయి అధికారులు ఎస్సీ, ఎస్టీల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కమిషన్ సూచించిన మేరకు పెండింగ్ నిధులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నిర్ణీత సమయంలో కమిషన్‌కు సమర్పిస్తామని తెలిపారు. విద్య, ఉపాధి, సంక్షేమం, జీవనోపాధి, గురుకుల విద్యాసంస్థల బలోపేతం, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్, ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుపతిరావు, ఎస్సీ డెవలప్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించారని దళిత సంఘాల నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు విన‌తి పత్రాలు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>