కలం, కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల జూలై 29, 30 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్న రాష్ట్ర కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మంకమ్మతోటలోని జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశాల పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సమావేశాలకు ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, జాతీయ ఉపాధ్యక్షురాలు ఆయుష్ ఘోష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణను ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో అందక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో విద్యార్థులు, తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెళ్ళి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇసాక్, సహాయ కార్యదర్శులు బోగేష్, గట్టు ఆకాశ్, జిల్లా కమిటీ సభ్యులు రోహిత్, సందేశ్, రక్షక్, నరేష్, నాయకులు సాయి, చందు, వరుణ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

