కలం, మహబూబ్ నగర్ బ్యూరో : అన్ని కులాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. శనివారం మహబూబ్ నగరంలోని కోయిల్‌కొండ ఎక్స్ రోడ్ వద్ద నిర్మించిన ఆధునిక సదుపాయాలతో కూడిన మాడ్రన్ స్లాటర్ హౌస్ (జంతు వధశాల)ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా పట్టణంలో స్లాటర్ హౌస్ లేకపోవడంతో ఈ వృత్తిలో నిమగ్నమైన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, స్థానికంగా స్లాటరింగ్ చేసే కార్మికులతో చర్చించి, వారి అవసరాలకు అనుగుణంగా డిజైన్ రూపొందించి ఈ మాడ్రన్ స్లాటర్ హౌస్ నిర్మించామని తెలిపారు. కార్మికులకు సౌకర్యవంతంగా పని చేయడానికి అవసరమైన అన్ని వసతులను కల్పించినట్లు ఆయన చెప్పారు.
ఇందులో పార్కింగ్ సదుపాయం, వెటర్నరీ డాక్టర్ సేవలు, విశ్రాంతి గదులు, నిరంతర నీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక సంప్ (వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ఏర్పాటు చేసి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ప్రధాన లైన్‌కు అనుసంధానం చేసినట్లు యెన్నం వివరించారు.
ఈ స్లాటర్ హౌస్ ప్రారంభంతో పట్టణంలోని ఆరెకటిక, ఖురేషీ వృత్తిదారులు ఇతరులకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపై నగరానికి చేరువలో ఉన్న మండలాల నుంచి కూడా నేరుగా ఇక్కడికి జంతువులను తీసుకురావడం సులభమవుతుందని తెలిపారు. ఈ జంతు వధశాల నిర్మాణంలో మధ్యలో వచ్చిన ఇబ్బందులను అధిగమించి, అవసరమైన అదనపు నిధులు కేటాయించి పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యెన్నం చెప్పారు.
ఈ సదుపాయాన్ని సంబంధిత వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వెంకటేష్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ , కార్పొరేటర్లు ఉమర్ కొత్వాల్, ఫయాజ్, ఫకృద్దీన్, శ్రీలేఖ, రమేష్, ఖమర్, మహబూబ్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజ్మత్ అలీ, మున్సిపల్ కమిషనర్ రామాంజులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

