కలం, వెబ్ డెస్క్: మహిళా పారిశ్రామిక వేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వారితో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FICCI Ladies Organisation) పారిశ్రామిక వేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నామని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని తెలిపారు.
హైటెక్ సిటీ ప్రాంతంలో శిల్పారామం పక్కనే రూ.1,000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ నిర్వహించడానికి కేటాయించినట్లు చెప్పారు. ఇక్కడ గ్రామీణ హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను విక్రయించడానికి మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రత్యేకంగా కేటాయించిన 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నట్లు వెల్లడించారు.
మహిళా సాధికారత కోసం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ తమ ముందుంచిన అభ్యర్ధనలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. హైటెక్ సిటీ, సీఐఐ కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ ఆఫీస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఫిక్కీని భాగస్వామిని చేస్తామన్నారు. ఇందు కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తామని తెలిపారు.
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరొక ఇండస్ట్రియల్ పార్క్ ను మహిళా సాధికారత కోసం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. వ్యాపార రంగంలో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ఏటా అవార్డులు ఇచ్చి గౌరవించే కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మహిళల కోసం చేసే ప్రతి పని తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని సీఎం తెలిపారు.

