కలం, స్పోర్ట్స్ : జపాన్ ఓపెన్ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్, ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫీపై సింధు అద్భుత విజయం సాధించారు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన మొదటి భారతీయ షట్లర్‌గా ఆమె రికార్డుకెక్కారు. ఈ మ్యాచ్‌లో సింధు మొదటి గేమ్‌ను 21-19తో గెలుచుకున్నారు. ఆ తర్వాత రెండో గేమ్‌లో కూడా సింధు 15-10తో ముందంజలో ఉన్న సమయంలో చెన్ యుఫీకి తీవ్రమైన మోకాలి నరం (హామ్‌స్ట్రింగ్) గాయమైంది.
దీంతో ఆమె మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విజయంతో చెన్ యుఫీ చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సింధు.. ఆ ఓటముల పరంపరకు బ్రేక్ వేశారు. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తర్వాత చైనా ప్లేయర్‌పై సింధు సాధించిన తొలి విజయం ఇదే కావడం విశేషం. టోక్యోలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో సింధు (PV Sindhu) ఆటతీరు మొదటి నుంచి అద్భుతంగా సాగుతోంది. ప్రపంచ ఐదో నంబర్ ప్లేయర్ హాన్ యుపై గెలిచి సింధు తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజోమి ఒకుహరా తప్పుకోవడంతో సింధుకు వాకోవర్ లభించింది. దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింధు మళ్లీ ఒక బిడబ్ల్యూఎఫ్ (BWF) టూర్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు. చివరగా ఆమె 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ ఫైనల్ చేరి టైటిల్ గెలిచారు. అలాగే 2022లో సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ విజయంపై పీవీ సింధు స్పందిస్తూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఫైనల్‌కు చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా అగ్రశ్రేణి ఆటగాళ్లతో ఆడేటప్పుడు ప్రతి పాయింట్ ఎంతో కీలకమని చెప్పారు. అందుకే మొదటి మ్యాచ్ నుంచి ప్రతి పాయింట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టానని, తొలి గేమ్‌ను గెలవడం తనకు బాగా కలిసివచ్చిందని సింధు పేర్కొన్నారు.
Read Also: ఆహారం కల్తీ చేసేవారికి సీఎం రేవంత్ వార్నింగ్
Follow Us On : WhatsApp

