కలం, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ (Nirmal Congress) లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయి. అధికార పార్టీ అయినప్పటికీ స్థానికంగా నాయకత్వ సమన్వయం లోపిస్తున్నదనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకే అంశంపై ఇద్దరు కీలక నేతలు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించడం, వర్గాల వారీగా పార్టీ కార్యకలాపాలు కొనసాగించడం కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలకు అద్దం పడుతోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇటీవల మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామక వ్యవహారం నియోజకవర్గంలో కొత్త వివాదానికి దారితీసింది. నియామకాల విషయంలో ఒక వర్గం అసంతృప్తి వ్యక్తం చేయగా, మరో వర్గం వాటిని సమర్థించింది. ఈ వ్యవహారం బహిరంగ విమర్శలకు దారితీయడంతో పార్టీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. అదే సమయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పరిశీలనలోనూ కాంగ్రెస్‌లో రెండు వర్గాల వ్యవహారం స్పష్టంగా కనిపించింది.
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ నిర్మల్ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు ఆయన వెంట ఉండి పార్టీ నాయకులకు సూచనలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా తన అనుచరులతో కలిసి విడిగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఇద్దరు నేతలు ఒకే అంశంపై వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడం కాంగ్రెస్‌లో సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ శ్రేణుల్లోనూ “ఎవరి వర్గం వారిదే”, “ఎవరి కార్యక్రమాలు వారివే” అనే పరిస్థితి నెలకొన్నట్లు చర్చ సాగుతోంది. ఒకే వేదికపై కనిపించాల్సిన నాయకులు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించడం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నిర్మల్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం అవసరమని, అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే ఈ గ్రూపు రాజకీయాలు భవిష్యత్తులో పార్టీకి (Nirmal Congress) ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశముందనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also: బాసర రైతులకు గుడ్‌న్యూస్.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే
Follow Us On: Sharechat

